"ఒరేయ్! ఎలా ఉన్నావురా? ఏమంటున్నాడు మీ మేనేజర్?"
"ఏమీ లేదురా! వాడేమీ పని చెయ్యడు గానీ, మా చేత వెట్టి చాకిరీ చేయిస్తాడు వెధవ పీనుగ. మా మీద పెత్తనం చలాయించడం చాలా ఇష్టం ఆ దరిద్రుడికి"
"మావాడు కూడా అంతేరా. ఒక్క రోజు ఆఫ్ తీసుకుంటానంటే ఏడ్చి చస్తాడు గాడిదకొడుకు!"
..................................................
ఇలాంటి మాటలు ఉద్యోగస్తుల దగ్గర వినని వాళ్ళెంతమందో చేతులత్తండి! ఎవరూ లేరా? హ్మ్! ఎవరూ ఉండరనే అనుకున్నా!
అసలు నిజంగా ఈ మేనేజర్లు పనిలేని పాపారావులా? వాళ్ళు పని చెయ్యకుండా పక్కవాళ్లని హింసపెడతారా? మేనేజ్‌మెంట్ అంటే ఎందుకూ పనికిరాని, అస్సలు పనిచెయ్యని ఉద్యోగమా? అలా అయితే మరి ప్రాజెక్టు మేనేజర్లకు అంతంత జీతాలెందుకు? వీటికి సమాధానాలు దొరకాలంటే అసలు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ అంటే ఏంటి అనే చొప్పదంటు ప్రశ్నతో మొదలు పెట్టాలి. పెట్టేద్దాం!
అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి?
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ - పింబాక్ (దీని గురించి తరవాత ముచ్చటించుకుందాం) నిర్వచనం ప్రకారం ప్రాజెక్ట్ అనేది ఒక నిర్దిష్టమైన ఫలితాన్నిస్తూ ఫలాన్నిచ్చే లేక సేవలనందించే ఒక తాత్కాలికమైన ప్రక్రియ. ప్రతీ పాజెక్ట్ కీ నిర్దేశిత ప్రారంభ మరియు ముగింపు సమయాలుంటాయి. ఫలం తాత్కాలికమయినా కాకపోయినా ప్రాజెక్ట్ మాత్రం తాత్కాలికమే.
ఇలాంటి ప్రాజెక్టుని నిర్వహించడమే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఈ పని ఎంత సులువో కష్టమో చూద్దాం. కానీ అక్కడిదాకా వెళ్ళెముందు ఓ నాలుగు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఏ ప్రాజెక్టుకైనా ముఖ్యమైన అంశాలు ఎనిమిది ఉంటాయి. అందులో నాలిగింటిమీద ప్రాజెక్టు భవిత్యం ఆధారపడి ఉంటుంది. ఆ నాలుగు అంశాలు మరో నాలుగు అంశాలపైన ఆధారపడి ఉంటాయి.
ప్రాజెక్టు ఆధారపడే నాలుగు అంశాలు:
1. సమయం / టైం ( ఆ ప్రాజెక్టును పూర్తి చెయ్యడానికి పట్టే సమయం)
2. నాణ్యత / క్వాలిటీ
3. ఆశయం, లక్ష్యం లేక గ్రాహ్యం / స్కోప్ (క్లుప్తంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు పూర్తి కావాడానికి జరగాల్సిన మొత్తం పని)
4. ఖర్చు / కాస్ట్
సరైన సమయంలో, అనుకున్న ఖర్చుతో, లక్ష్యాన్ని పూర్తిగా ఛేదిస్తూ, నాణ్యతగల ఫలితాన్నివాలన్నమాట. మరి ఈ నాలుగూ సక్రమంగా ఉండాలంటే కావాలసినదేమిటి?
5. అనర్ధ / ప్రమాద నివారణ ( రిస్క్ మేనేజ్‌మెంట్)
6. వస్తు నిర్వహణ ( మేటీరియల్ రిసోర్స్ మేనేజ్మెంట్)
7. పనివారి నిర్వహణ ( హ్యూమన్ రీసోర్స్ మేజేన్‌మెంట్)
8. సమాచార, సంబంధ, ప్రసారాల నిర్వహణ (కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్)
*** వీటన్నిటినీ కలిపి నిర్వహించడానికి సమగ్ర నిర్వహణ (ఇంటిగ్రేషన్ మేనేజ్‌మెంట్) ***
పైన చెప్పినవాటన్నిటినీ సమర్ధవంతంగా నిర్వహించే బాధ్యత కేవలం ప్రాజెక్టు మేనేజర్ ది. తమపనులు తాము చేస్కుంటూ, తెల్లారిందా, ఆఫీసుకెళ్ళామ, పనిచేశామా, ఇంటికొచ్చామా, పడుకున్నామా అనుకునేవారికి పై వాటి విలువ తెలియకపోయినా, అసలు ప్రాజెక్టు గురించి దీర్ఘంగా ఆలోచించేవారికి పైన చెప్పినవి ఎంత క్ష్టమైన పనులో వేరే వివరించక్కరలేదు. అందులో ఏ ఒక్క దానిలో చిన్న తప్పు దొర్లినా, తెగే తల ప్రాజెక్టు మేనేజర్ దే. అదీ కాక, పని చెయ్యడం కన్నా, చేయించడం చాలా కష్టం. (దీని గురించి కూడ తరవాత విపులంగా చర్చిద్దాం). ఎన్నో ఒడిదిడుకులని తట్టుకొని పైవాటిని నిర్వహించడం అంటే నల్లేరుమీద నడక కాదు. ఒకప్పుడు తిట్టుకున్నవారే స్వయంగా ప్రాజెక్టు మేనేజర్లయ్యాక తామెంత తప్పుగా ఆలోచించారో అర్ధం చేసుకుంటారు.
Hi Bharadwaj,
ReplyDeletewhen we can get the next post on PMP ? Please continue the posts on this topic.
-Sriram