కొంతమంది బ్లాగర్ల డిమేండ్ వల్ల దీనిని బయటికి తీసి మళ్ళీ బూజు దులుపుతున్నా :)
తిన్నగా విషయంలోకి వస్తే, క్రిందటి టపాలలో మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ గ్రూపులగురించి చర్చించాం కదా, దానితరువాత మనం చూడబోయేది పరిజ్ఞాన విభాగాల (నాలెడ్జ్ ఏరియాల గురించి). పింబాక్ మనకి మొట్టమొదటగా పరిచయం చేసే విభాగం ప్రాజెక్ట్ ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్.
ప్రాజెక్ట్ ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్లో ఉండే అంశాలు ఒక ప్రాజెక్టును గుర్తించడానికి, నిర్వచింపడానికి, దానికి సంబంధించిన ప్రాసెస్ గ్రూపుల్లోని పనులన్నిటినీ ఒక చోట చేర్చి వాటిని నిర్వహించడానికి అవసరమైన ప్రక్రియలు. మన వాబిని త్రవ్వే ఉదాహరణే తీసుకుంటే, అందులో ఖర్చుకి సంబంధినంచినవి, సమయపాలనకి సంబంధించినవి, శ్రమకి సంబంధించినవి, నాణ్యతకి సంబంధించినవి, ఎన్నో ప్రక్రియూలుంటాయి. వాటన్నిటినీ అనుసంధానం చేసి ప్రాజెక్టు సాఫీగా సాగేలా చూడడమే ఇంటిగ్రేషన్ మేజేజ్మెంట్.
ఇది మనకి ఎక్కడ కనబడదో చెప్పగలరా? సులువే లేండి - మన ప్రభుత్వ సంస్థలలో :) ఏ విభాగానికి ఆ విభాగం పనులు బాగానే చేస్తాయి గానీ, వాటన్నిటినీ కలిపి ఒక కొలిక్కి తీసుకొచ్చేనాథుడెక్కడా?
సరే, ఇక మన ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్ విషయానికొస్తే - దీనిలో మనకి కనబడే ప్రాసెస్ లు ఏడు.
1. ప్రాజెక్ట్ చార్టర్ను సృష్టించడం:
ప్రాజెక్ట్ చార్టర్ అంటే ఏమీ లేదండీ - ప్రాజెక్ట్ కి, దానికి సంబంధించిన పనులకీ సంబంధించిన ఒక ఒడంబడిక - ఒక శాసనము లాంటిదనుకోండి. ఏడయినా పని మొదలు పెట్టేముందు దానికి సంబంధించిన కాంట్రేక్ట్ మీద సంతాకాలు పెట్టుకుంటాం కదా? ఇదీ అలాంటిదే. ఒక దశకి సంబంధించిన పనులకి అనుమతినిచ్చేది ఈ చార్టరే. చార్టర్ సృష్టింపబడింది అంటే దానర్థం జరగపోయే పనికి రాజముద్రిక లభించినట్టే.
2. ప్రారంభిక గ్రాహ్య ప్రవచనాన్ని (కొత్తగా ఉందా? అదేనండి ఆంగ్లంలో ప్రిలిమినరీ స్కోప్ స్టేట్మెంట్ అంటాం) సృష్టించడం:
ప్రాజెక్టుకి సంబంధించినంత వరకూ స్కోప్ లేదా గ్రాహ్యం అంటే ఆ ప్రాజెక్టులో పనులు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో చెప్పేదన్నమాట. ఈ స్కోప్ స్టేట్మెంట్ ద్వారా మనం తెలుసుకునేది - పని ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ఆపాలో, ఏమి సాధించాలోనన్న విషయం. ముందుగా ఒక ప్రారంభిక స్టేట్మెంటును టూకీగా సృష్టించి తరువాత దానికి వివరాలు జత చేసి విపులంగా తయారు చెయ్యడం చాలామంది అవలంబించే పధ్ధతి విపులంగా తయారు చెయ్యడం చాలామంది అవలంబించే పధ్ధతి.
3. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రణాళికను సృష్టించడం:
ఏమేమి పనులు ఏవిధంగా చెయ్యాలో రూపొందించిన వివిధ ప్రణాళికలని అనుసంధానించి ఒక మహా ప్రణాళికను తయారుచెయ్యడమన్నమాట
4. ప్రాజెక్టుకి దిశానిర్దేశనం చెయ్యడం (ప్రాజెక్ట్ ఎక్సిక్యూషన్ ని డిరెక్ట్ చెయ్యడమన్నమాట)
ఇప్పుడు మనం ఒక బావిని త్రవ్వే ఉదాహరణ తీసుకుంటే, ఆరొగ్యం బాలేక ఒక కార్మికుడు పనిలోకి రాకపొటే వెంటనే ఏమి చెయ్యాలో, సమయానికి పని జరిగెడట్టు ఎలాంటి అమరైకలుండాలో, ఎప్పుడు ఏమి చెయ్యాలో అర్ధంకాని టీముకి ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయించడమన్నమాట.
5. ప్రాజెక్ట్ పనులని సమీక్షించి, నియంత్రించడం - ( మానీటర్ & కంట్రోల్ అంటాం)
గునపాలు తీసుకురావాల్సిన గంగరాజు పక్కింటి పైడితల్లితో హస్కేసుకోకుండా, ముహూర్తం పెట్టాల్సిన శాస్త్రి మాజీ ఎమ్మెల్యే గారి తద్దినానికి పారిపోకుండా చూడడంలాంటిదన్నమాట
6. మార్పు నియంత్రణ (ఇంటెగ్రేటెడ్ ఛేంజ్ కంట్రోల్):
అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అది పనెందుకౌతుంది చెప్పండి? అసలు ప్రాజెక్ట్ మేనేజర్లే అవసరం లేదు కదా. మార్పు అన్నది నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూనే ఉంటాయి, ఆ మార్పుల ప్రభావం వాటికి సంబంధించిన ప్రాజెక్టులమీద ఉంటుంది. అటువంటి మార్పులని నియంత్రించి, ఆ మార్పులకనుగుణంగా ప్రాజెక్టుని నడిపించడమే ఇంటెగ్రేటెడ్ చేంజ్ కంట్రోల్. మార్పు కోరే వారి విన్నపాలని సమీక్షించడం, ఆమోదించడం లేక తిరస్కరించడం, ఆ మార్పుకు ప్రభావితమయ్యే నిర్గమాంశాలను నియంత్రించడం దీనిలో భాగాలే.
ఉదాహరణకి - బావి తవ్వడానికి మూడోరోజు రావాల్సిన పనిముట్లు రాలేదనుకోండి - ఏమి చెయ్యాలి? పని ఆపెయ్యలేము కదా (అత్యవసరమైతే తప్ప)? అక్కడ ఉన్న మేనేజర్ పరిస్థితిని సమీక్ష్మిచి, ఆ రోజు తవ్వకాలకు పూనుకోకుండా, అప్పటిదాకా తవ్విన మట్టి, రాళ్ళని వేరే చోటికి తరలించే పనిని కార్మికులకి అప్పచెప్పాడనుకోండి - సమయమూ వృధాకాదు, పని కూడా జరుగుతుంది ( ఇది ఉదాహరణకి మాత్రమే - దీనికి ఈకలు మాత్రం పీకద్దు దయచేసి:)) )
7. ప్రాజెక్టును పూర్తిచెయ్యడం: (క్లోస్ ప్రాజెక్ట్)
ప్రాజెక్ట్ ప్రాసెస్ గ్రూపులకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యేలా చూడడం, లాంఛన ప్రాయంగా ప్రాజెక్టు సమాప్తమైందనిపించడం గట్రా.
దీనియొక్క ప్రాసెస్ ఫ్లో క్రింద చూపిన విధంగా ఉంటుంది